ఓవర్ హైప్.. రెండు వైపులా పదునున్న కత్తి: టాలీవుడ్లో ఒక సినిమా విడుదలకు ముందు ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో భారీ డైలాగులు మాట్లాడటం, ఆకాశాన్ని తాకేలా అంచనాలు పెంచడం అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది సినిమాకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తేవడానికి ఎంత ప్లస్ అవుతుందో, ఒకవేళ అంచనాలు అందుకోలేకపోతే అంతే వేగంగా నెగిటివ్ మౌత్ టాక్‌తో సినిమాను ముంచేయడానికి కూడా కారణమవుతుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా విషయంలోనూ సినీ పరిశ్రమలో ఇదే ప్రమాదాన్ని గుర్తు చేస్తూ చర్చలు నడుస్తున్నాయి.
అతిగా అంచనాలు పెంచడం వల్ల వచ్చే నష్టాలు: సినిమా విశ్లేషణల ప్రకారం… ప్రమోషన్లలో విపరీతంగా హైప్ క్రియేట్ చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. హైప్ పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రేక్షకులు థియేటర్‌కి ఒక ‘మాస్టర్ పీస్’ చూస్తామనే నమ్మకంతో వెళ్తారు. ఒకవేళ సినిమా బాగున్నా కూడా, ఆ అసాధారణ అంచనాలను అందుకోలేకపోతే ప్రేక్షకులు నిరాశ చెందుతారు. దీనివల్ల సినిమా యావరేజ్‌గా ఉందనాల్సిన చోట, బాలేదనే నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో మొదలైపోతుంది. భారీ హైప్ ఉన్న చిత్రాల థియేట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకు కొనుగోలు చేస్తారు కాబట్టి, సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వకపోతే వారు కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది.
బుచ్చిబాబు ఓవర్ డోస్ స్టేట్మెంట్స్ – ఫ్యాన్స్ టెన్షన్: కొద్ది రోజుల క్రితం వరకు ‘పెద్ది’ సినిమాకు సరైన ప్రమోషన్స్ లేవనే విమర్శలు రాగా, ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూలతో ఒక్కసారిగా సీన్ మార్చేశాడు. రామ్‌చరణ్ కష్టం గురించి, సినిమా గొప్పదనం గురించి ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో భారీ విషయం చెబుతూ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాడు. కంటెంట్‌పై నమ్మకం ఉన్నప్పుడు ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని, గతంలో ఇలాంటి ఓవర్ ఎమోషనల్ ప్రమోషన్స్ కొన్ని సినిమాలను ఎలా ముంచేశాయో గుర్తు చేసుకుంటూ మెగా అభిమానులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. మరి ఈ ఓవర్ డోస్ హైప్ ‘పెద్ది’ చిత్రానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.









