భారత్-పాక్ దేశ విభజన జరిగి దాదాపు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్న వేళ పాకిస్థాన్‌లోని చారిత్రక నగరం లాహోర్ తన పూర్వ వైభవాన్ని, బహుళ సంస్కృతిని తిరిగి చాటుకునేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఇస్లామిక్ లేదా స్థానిక పాక్ ప్రముఖుల పేర్లతో మార్చిన వీధులు, కూడళ్లు, రహదారులకు.. విభజనకు ముందున్న హిందూ, సిక్కు, జైన్, బ్రిటిష్ వలసరాజ్యాల కాలం నాటి పాత పేర్లను అధికారికంగా పునరుద్ధరిస్తోంది. పాకిస్థాన్ పంజాబ్ ప్రాంత ముఖ్యమంత్రి మరియం నవాజ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ చారిత్రాత్మక నిర్ణయానికి అధికారిక ఆమోదం లభించింది.
ఈ చారిత్రక మార్పుల్లో భాగంగా లాహోర్ నగరంలోని పలు కీలక ప్రాంతాల పేర్లు మారిపోయాయి. ఇప్పటివరకు ‘ఇస్లాంపురా’గా పిలిచిన ప్రముఖ ప్రాంతం మళ్లీ ‘కృష్ణా నగర్’గా రూపాంతరం చెందింది. అలాగే ‘బాబ్రీ मसीद् చౌక్’ తిరిగి ‘జైన్ మందిర్ చౌక్’గా, ‘సున్నత్ నగర్’ ప్రాంతం ‘సంత్ నగర్’గా, ‘ముస్తఫాబాద్’ మళ్లీ ‘ధరమ్‌పురా’గా మారుస్తూ పంజాబ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. లాహోర్ నగరానికి ఉన్న భిన్న మతాలు, విభిన్న సంస్కృతుల చారిత్రక గుర్తింపును గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటికే నగరంలోని తొమ్మిది ప్రధాన ప్రాంతాలలో పాత చారిత్రక పేర్లతో కూడిన కొత్త సైన్‌బోర్డులు వెలిశాయి.
ఈ పేర్ల మార్పు వెనుక ‘లాహోర్ హెరిటేజ్ ఏరియాస్ రివైవల్ ప్రాజెక్ట్’ ప్రధానంగా పని చేస్తుండగా, దీనికి అధిపతిగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యవహరిస్తున్నారు. కేవలం వీధుల పేర్లకే పరిమితం కాకుండా మహారాజా రంజిత్ సింగ్ కాలం నాటి కట్టడాలు, పురాతన చర్చిలు, అలాగే గతంలో కూల్చివేతకు గురైన చారిత్రక క్రికెట్ మైదానాలు, మింటో పార్క్ (గ్రేటర్ ఇక్బాల్ పార్క్) లోని పాత కుస్తీ అఖారాలను కూడా పునరుద్ధరించే పనులను ప్రారంభించారు. దేశ విభజనకు ముందు భారత మాజీ క్రికెట్ దిగ్గజం లాలా అమర్‌నాథ్ శిక్షణ పొందిన మైదానాలు, గామా పెహల్వాన్ వంటి మల్లయోధులు కేకలు వేయించిన కుస్తీ వేదికలు కూడా ఇందులో ఉండటం విశేషం. దశాబ్దాలుగా అధికారిక రికార్డుల్లో పేర్లు మారినా సామాన్య ప్రజల నిత్య జీవితంలో లక్ష్మీ చౌక్, క్వీన్స్ రోడ్ వంటి పాత పేర్లే సజీవంగా ఉండటంతో ఈ తాజా నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.









