తైవాన్ సంక్షోభం, దక్షిణ చైనా సముద్ర వివాదాల నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య వ్యూహాత్మక ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఈ క్రమంలో ఒకవేళ అమెరికా తమపై దాడికి దిగితే, దానిని బలంగా తిప్పికొట్టి కోలుకోలేని దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా భారీ ఎత్తున అణు మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. జింజియాంగ్ ఉయ్‌గర్ ఎడారిలోని మారుమూల ప్రాంతంలో, సుదూర శ్రేణి క్షిపణులు కలిగిన అణు స్థావరాల సమీపంలో డజన్ల కొద్దీ సరికొత్త ల్యాంచ్ ప్యాడ్‌లు, బంకర్లు, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలతో కూడిన భారీ నెట్‌వర్క్‌ను చైనా నిర్మిస్తున్నట్లు తాజాగా ఉపగ్రహ (శాటిలైట్) చిత్రాలు బయటపెట్టాయి. శత్రుదేశం అణుదాడికి పాల్పడితే ఎదురుదెబ్బ తీసే సామర్థ్యాన్ని (సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ) బలోపేతం చేసుకోవడం కోసమే డ్రాగన్ వేలాది కిలోమీటర్ల పరిధిలో ఈ రహస్య సైనిక నిర్మాణాలను వేగవంతం చేసినట్లు రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. చైనా తన మొబైల్ క్షిపణి ల్యాంచర్లు, గగనతల రక్షణ వ్యవస్థల కోసం ఏకంగా 80కి పైగా సరికొత్త ప్యాడ్‌లను సిద్ధం చేస్తోంది. వీటితో పాటు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, కమాండ్ ఆపరేషన్లకు ఉపయోగపడే కీలక సౌకర్యాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. తూర్పు జిన్‌జియాంగ్ ఎడారిలో గత ఆరేళ్లుగా నిర్మించిన రెండు అష్టభుజి (ఆక్టాగన్) ఆకార నిర్మాణాల చుట్టూ ఈ కొత్త మౌలిక సదుపాయాలు కేంద్రీకృతమయ్యాయి. ఈ ఆక్టాగన్లలో సైనిక సిబ్బంది నివాసాలు, భారీ సైనిక వాహనాలు ఉన్నట్లు చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. వీటికి ఇరువైపులా పటిష్టమైన ఆయుధ నిల్వ ప్రాంతాలు, సాయుధ బంకర్లతో పాటు, వీటిని హమీ అణు క్షిపణి క్షేత్రాలతో (Hami Silo Fields) అనుసంధానించేలా రైల్వే లైన్లు, వైమానిక స్థావరాలను కూడా చైనా ఏర్పాటు చేసింది.
చైనా తన అణ్వాయుధ సామర్థ్యాలను ఇతర దేశాల కంటే అత్యంత వేగంగా పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెంటగాన్ నివేదికల ప్రకారం.. చైనా అణు బాంబుల తయారీ వేగం స్వల్పంగా తగ్గినప్పటికీ, 2030 నాటికి 1,000 వార్‌హెడ్‌లను సిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తన మూడు ప్రధాన సిలో ఫీల్డ్‌లలో దాదాపు 100 ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులను (ICBMs) చైనా సిద్ధంగా ఉంచినట్లు అంచనా. చైనా అధికారికంగా ‘నో ఫస్ట్ యూజ్’ (ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోము) అనే విధానాన్ని పాటిస్తున్నప్పటికీ, తైవాన్ విషయంలో బాహ్య శక్తులైన అమెరికా వంటి దేశాల జోక్యాన్ని పరిమితం చేయడానికి, భవిష్యత్తులో ఇటువంటి అణు బెదిరింపుల వ్యూహాలకు పదును పెడుతోందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.









