విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఈరోజు వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగివున్న లారీని, ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బస్సు వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాంబాబు, ప్రయాణికురాలు ఈశ్వరమ్మతో పాటు మరో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తుండగా, తెల్లవారుజామున 4 గంటల సమయంలో డ్రైవర్ చీకట్లో ఆగి ఉన్న లారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు ప్రయాణికులను అత్యవసర చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.









