కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని లోక్‌భవన్ గ్లాస్‌హౌస్‌లో జరిగిన ఈ వేడుకలో గవర్నర్ థావర్ చంద్ గహ్లాట్ ఆయన చేత ప్రమాణ నిరూపణ చేయించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీఎం పీఠం దక్కడంతో, ప్రమాణస్వీకారానికి ముందు డీకే శివకుమార్ వేదికపై నుంచే ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ హై-ప్రొఫైల్ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
డీకే శివకుమార్‌తో పాటు డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత, సిద్ధూ కేబినెట్‌లో మాజీ హోం మంత్రిగా పనిచేసిన జి. పరమేశ్వర ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు మరో 13 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో సిద్ధరామయ్య తనయుడు యత్రీంద్ర, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, కేహెచ్ మునియప్ప, కె.జె.జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జర్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణబైరి గౌడ, మాజీ స్పీకర్ యు.టి.ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్‌లు ఉన్నారు. జ్యోతిషశాస్త్ర పరిగణనల ప్రకారం ప్రమాణస్వీకార వేదిక ద్వారాలు, ఆసనాల అమరికలో మార్పులు చేయడం గమనార్హం.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన సమయం నుంచే డీకే శివకుమార్ సీఎం పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే నాడు అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యకు అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. రెండున్నరేళ్ల పాలన తర్వాత డీకేకు అవకాశం ఇస్తామన్న హైకమాండ్ ముందస్తు ఒప్పందం ప్రకారం.. గతేడాది నవంబర్‌తో సగం కాలం ముగిశాక నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ నడిచింది. చివరకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధరామయ్యను ఒప్పించి రాజీనామా చేయించడంతో డీకే శివకుమార్ కల నెరవేరింది. సుమారు 3 వేల మంది పోలీసులతో ఈ వేడుకకు భారీ భద్రత కల్పించారు.









