ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కిల్లర్’ సెట్‌లో బుధవారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం జరిగింది. చెన్నైలోని ఒట్టేరి బిన్నీ మిల్స్ ప్రాంగణంలో ఈ సినిమా తాజా షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన గ్యాస్ బెలూన్ సిలిండర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున విషాదం చోటుచేసుకుంది.
బుధవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో జరిగిన ఈ భారీ పేలుడు కారణంగా సెట్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మధురవోయల్‌కు చెందిన మదన్ (26) అనే లైట్ టెక్నీషియన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మందికి పైగా సినిమా సిబ్బంది గాయపడ్డారు. వీరిలో శక్తివేల్ (27), సూర్య (23), దినకరన్ (24) అనే ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని హుటాహుటిన సమీపంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యాక్టర్‌గా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఎస్‌జే సూర్య, దాదాపు దశాబ్ద కాలం తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించే ‘కిల్లర్’ చిత్రంతో మళ్లీ మెగాఫోన్ పట్టారు. గోకులం మూవీస్ మరియు ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి అస్రాణి హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సెట్‌లో ఇలాంటి ప్రమాదం జరగడం కోలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది.









