తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సరికొత్త సమీకరణాలతో హీటెక్కుతున్నాయి. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ.. ఇప్పుడు రాబోయే ఉపఎన్నికపై పూర్తి ఫోకస్ పెట్టింది. విజయ్ తాను గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ బైపోల్ అనివార్యమైంది. అయితే ఈ స్థానం నుండి టీవీకే అభ్యర్థిగా స్టార్ హీరోయిన్ త్రిష కాకుండా, ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ బరిలోకి దిగబోతున్నారంటూ సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
మొదట్లో విజయ్ స్నేహితురాలు త్రిష ఇక్కడి నుండి పోటీ చేయబోతోందంటూ తమిళ మీడియాతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం త్రిషకు ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని తేలిపోవడంతో ఆ ప్రచారానికి పూర్తిగా బ్రేక్ పడింది. ఇదే సమయంలో రాఘవ లారెన్స్‌కు ఉన్న మాస్ ఇమేజ్, ముఖ్యంగా యువతలో ఉన్న ఫాలోయింగ్, మరియు ఆయన చేసే సేవా కార్యక్రమాలు పార్టీకి భారీగా కలిసివస్తాయని టీవీకే అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. లారెన్స్ మొదటి నుంచి విజయ్‌కి గట్టి మద్దతుదారుడిగా ఉంటూ, టీవీకే క్లీన్ స్వీప్ విజయంపై ఓపెన్‌గానే ప్రశంసలు కురిపించారు.
రాజకీయాల్లోకి వచ్చే ఈ కీలక నిర్ణయంపై లారెన్స్ ఇప్పటికే తన గురువు, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చర్చించినట్లు సమాచారం. తలైవా రజినీకాంత్ ఇచ్చే సలహాలు, ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాతే లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక బరిలో లారెన్స్ నిలవడం ఖరారైతే.. తమిళనాట సరికొత్త రాజకీయ పోరు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.









