ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: హరీశ్ రావు సంచలన ఆరోపణలు

పాలమూరు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలను “మతిలేని మాటలు” గా కొట్టిపారేసిన ఆయన, సాగునీటి ప్రాజెక్టులపై తమను విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదన్నారు. బీఆర్ఎస్ చేపట్టబోయే పాదయాత్ర భయంతోనే ముఖ్యమంత్రికి నిద్ర కరువైందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చేసిందేమీ లేదని హరీశ్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో లోపాయికారీగా కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుమ్మక్కు రాజకీయాల వల్లే ఈ ఏడాది కృష్ణా నది నీటిలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 75 శాతం నీటిని వాడుకుంటే, తెలంగాణ కేవలం 25 శాతానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆయన గణాంకాలతో సహా ఎండగట్టారు.

తెలంగాణకు జరిగిన ఈ అన్యాయానికి, వైఫల్యానికి గానూ సీఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు రైతులు ఘోరంగా మోసపోయారని, రాబోయే రోజుల్లో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడించి, పాలమూరు గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు