ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తాను గతంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఫిట్‌నెస్ ప్రమాదం, ఆరోగ్య సమస్య గురించి తాజాగా స్పందించారు. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న సమయంలో ఎటువంటి సేఫ్టీ బెల్ట్ లేకుండా 80 కిలోల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తడానికి ప్రయత్నించడం వల్ల తాను స్లిప్ డిస్క్ బారినపడ్డానని ఆమె వెల్లడించారు. ఆ తీవ్ర గాయం కారణంగా సుమారు 40 రోజుల పాటు కదల్లేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆనాటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
నేహా ధూపియా, అంగద్ బేడీలు నిర్వహిస్తున్న ‘డబుల్ డేట్’ టాక్ షోలో తన భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్ ఈ విషయాలను పంచుకున్నారు. ట్రైనర్‌లు ఏం చెప్పినా సరే డెడ్‌లిఫ్ట్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాయామమని, అది కేవలం ఒక ‘ఈగో లిఫ్ట్’ (అహం కోసం చేసేది) మాత్రమేనని ఆమె అభివర్ణించారు. తాను చేసిన చిన్న పొరపాటు వల్ల తీవ్రమైన నరాల సంబంధిత సమస్యలు తలెత్తాయని, ఎంతో చురుకుగా ఉండే తాను రోజువారీ పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి రావడం తనను శారీరకంగానే కాక మానసికంగానూ ఎంతో కృంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
2024 ఫిబ్రవరిలో గోవా వేదికగా వివాహం చేసుకున్న ఈ జంట, తమ వైవాహిక బంధానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఈ షోలో పంచుకున్నారు. తాను అనుభవించిన ఆ క్లిష్ట పరిస్థితుల్లో, కనీసం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు తన భర్త జాకీ భగ్నానీ తనకు అండగా నిలిచి ఎంతో ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించారని రకుల్ ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా కృతజ్ఞతతో పేర్కొన్నారు.









