ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లిన ఒక భారతీయ యువకుడు మైనర్ బాలికను లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించి స్థానిక ప్రజలకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. యూకేలోని లీడ్స్ నగరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ‘బ్రిటిష్ పేట్రియాట్స్’ అని పిలుచుకునే స్థానిక సమూహానికి చెందిన సభ్యులు ఈ ఘోరాన్ని బట్టబయలు చేయగా, నిందితుడు తప్పు ఒప్పుకుంటూ తనను పోలీసులకు పట్టించవద్దని వారి కాళ్లపై పడి రోదించడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసులో పట్టుబడిన నిందితుడిని 27 ఏళ్ల ప్రవ్నా భట్‌గా అధికారులు గుర్తించారు. నిలదీసిన సమయంలో అతడు వెల్లడించిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం స్టూడెంట్ వీసాపై బ్రిటన్‌కు వచ్చిన అతడు, ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో ఉన్నత చదువులు పూర్తి చేశాడు. చదువు ముగిసిన అనంతరం లభించే పోస్ట్ స్టడీ వర్క్ వీసా (పీఎస్‌డబ్ల్యూ) పై ప్రస్తుతం యూకేలోనే నివసిస్తున్నాడు. ఆన్‌లైన్ చాటింగ్‌లో సదరు బాలిక వయసు కేవలం 14 ఏళ్లే అని తెలిసినప్పటికీ, నిరంతరం అసభ్యకర సందేశాలు మరియు తన నగ్న వీడియోలను పంపుతూ ఆమెను లైంగికంగా వేధించినట్లు విచారణలో తేలింది.
చివరికి బాలికను రహస్యంగా కలవడానికి నిర్దేశిత ప్రాంతానికి వచ్చి వేచి చూస్తుండగా స్థానికులు అతడిని పట్టుకున్నారు. యూకేలో భారతీయ యువకులు ఇలాంటి ఆన్‌లైన్ చైల్డ్ గ్రూమింగ్ కేసుల్లో చిక్కడం ఇదే మొదటిసారి కాదు. గత జనవరిలోనే కోవెంట్రీ నగరంలో గురీత్ జితేష్ అనే మరో భారతీయ విద్యార్థి మైనర్ బాలికల వేధింపుల కేసులో బ్రిటన్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతూ దేశ ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.









