తమిళనాడులో ప్రైవేట్ స్కూల్ ఫీజుల వైరల్ లిస్ట్ పూర్తి అవాస్తవం: నిపుణుల స్పష్టత!

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఒకే రకమైన ఫీజుల విధానం అమల్లోకి వచ్చిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని విద్యా రంగ నిపుణులు స్పష్టం చేశారు. ఐదో తరగతి లోపు విద్యార్థులకు రూ. 19 వేలు, ఇంటర్ విద్యార్థులకు రూ. 26 వేల లోపే ఫీజులు నిర్ణయించారంటూ వైరల్ అవుతున్న పట్టిక నిజం కాదని వారు తేల్చి చెప్పారు. ఈ వైరల్ లిస్ట్ అనేది కేవలం ఒక నిర్దిష్ట విద్యా సంస్థకు సంబంధించినది మాత్రమేనని, రాష్ట్రంలోని అన్ని బడులకు ఇది వర్తించదని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లు తమ ట్యూషన్ ఫీజుల వివరాలను జూన్ 5వ తేదీ లోపు నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని విద్యాశాఖ ఆదేశించడంతో ఈ తరహా ప్రచారం మొదలైంది.

నిజానికి తమిళనాడు స్కూల్ ఫీజు నిర్ధారణ కమిటీ (TN Fee Committee) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు కలిపి ఒకే సాధారణ ఫీజును ఎప్పుడూ ప్రకటించదు. తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల చట్టం ప్రకారం.. ప్రతి విద్యా సంస్థను విడివిడిగా పరిశీలించి ఫీజులను నిర్ణయిస్తారు. ఆయా పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు, ఉపాధ్యాయుల జీతభత్యాలు, భౌగోళిక ప్రాంతం మరియు రోజువారీ నిర్వహణ వ్యయాలను క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాతే కమిటీ ఒక నిర్దిష్ట ఫీజు నిర్మాణాన్ని ఖరారు చేస్తుంది. ఈ విధంగా ఆమోదించిన ఫీజులు వరుసగా మూడు విద్యా సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి.

ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కమిటీ ఆమోదించిన వివరాలను గమనిస్తే.. ఒకే తరగతికి వేర్వేరు స్కూళ్లలో ఫీజుల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో వార్షిక ఫీజు రూ. 10,000 లోపే ఉండగా, నగరాల్లోని ప్రముఖ మెట్రిక్యులేషన్ స్కూళ్లలో అదే తరగతికి ఫీజు రూ. 60,000 దాటింది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు ఫీజుల పట్టికలను నమ్మవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాలల అసలైన ఫీజు వివరాలను ప్రభుత్వం అధికారికంగా అందిస్తున్న ‘tnfeecommittee.com’ వెబ్‌సైట్‌లో సరిచూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు