ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కొంటున్న నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా చేరింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణ ప్రమాదాలు పొంచి ఉన్న టాప్-30 నగరాలలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ‘మూవింగ్ బియాండ్ ఎక్స్‌పోజర్’ పేరిట ప్రపంచవ్యాప్తంగా 205 ప్రధాన నగరాలపై ఈ పరిశోధన జరగ్గా, కేవలం గరిష్ఠ ఉష్ణోగ్రతలే కాకుండా నగరాల్లోని కూలింగ్ సదుపాయాలు, పచ్చదనం క్షీణత, సామాజిక-ఆర్థిక పరిస్థితులను ప్రాతిపదికగా తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. ఒక కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ నగరానికి ‘హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్’లో 0.68 స్కోర్ లభించడంతో, అంతర్జాతీయ నగరాలైన కైరో, మనీలా సరసన చేరాల్సి వచ్చింది.
భారతదేశం విషయానికి వస్తే అహ్మదాబాద్, నాగ్‌పూర్, మదురై నగరాల్లో హైదరాబాద్ కంటే ఎక్కువ వేడి ముప్పు ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. అయితే ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల పరిస్థితి హైదరాబాద్ కంటే కాస్త మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణ ముప్పును ఎదుర్కొంటున్న టాప్-50 నగరాల జాబితాను పరిశీలిస్తే, అందులో 14 నగరాలు భారతదేశానికి చెందినవే కావడం గమనార్హం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ, కాంక్రీట్ వనంగా మారుతున్న పట్టణాలు పర్యావరణానికి ఎంతటి ముప్పుగా పరిణమిస్తున్నాయో ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.
ఈ ఏడాది వేసవి కాలంలో హైదరాబాద్ నగరం గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతటి తీవ్రమైన ఎండలను చవిచూసింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 మధ్యకాలంలో రికార్డు స్థాయిలో సుమారు 47 రోజుల పాటు నగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. నగరం వేగంగా విస్తరించడం, కాంక్రీట్ నిర్మాణాలు పెరిగి పచ్చదనం క్షీణించడం, అందరికీ అందుబాటులో కూలింగ్ సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలు ఈ ముప్పును మరింత తీవ్రం చేస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నగర పాలకులు తక్షణమే స్పందించి పచ్చదనాన్ని భారీగా పెంచాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా కూలింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.









