చలాన్ మెసేజ్‌తో పంజాగుట్ట పోలీసు అధికారికి సైబర్ నేరగాళ్ల షాక్: ఖాతా నుంచి రూ.49 వేలు మాయం

సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా, రక్షణ కల్పించే పోలీసు అధికారులను సైతం లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) సైబర్ మోసానికి గురయ్యారు. ఆర్టీఏ (RTA) చలాన్ పేరుతో మొబైల్‌కు వచ్చిన ఒక నకిలీ లింక్‌ను క్లిక్ చేయడంతో, ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ. 49,139 క్షణాల్లో మాయమయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు ఎంతగా అప్రమత్తం చేస్తున్నా, సాక్షాత్తు ఒక పోలీస్ అధికారే ఇలా సైబర్ దగాకు గురికావడం నగరంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నరసయ్య మొబైల్ ఫోన్‌కు జూన్ 8వ తేదీన ట్రాఫిక్ చలాన్ బకాయి ఉన్నట్లు ఒక నకిలీ మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న ఏపీకే (APK) ఫైల్ లింక్‌ను నిజమైనదిగా నమ్మి ఆయన క్లిక్ చేశారు. ఆ ఫైల్ ఫోన్ లోకి డౌన్‌లోడ్ అవ్వడమే ఆలస్యం.. సైబర్ నేరగాళ్లు మాల్వేర్ సాయంతో ఆయన బ్యాంకింగ్ వివరాలను మరియు వ్యక్తిగత డేటాను దొంగిలించారు. ఆ తర్వాత ఏఎస్ఐ ప్రమేయం లేకుండానే ఆయన ఖాతా నుండి వరుసగా నగదు డెబిట్ అయినట్లు ఫోన్‌కు సందేశాలు రావడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

నగదు విత్‌డ్రా అయినట్లు గమనించిన బాధిత ఏఎస్ఐ నరసయ్య వెంటనే అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిధులు ఏ ఖాతాలకు బదిలీ అయ్యాయనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఏపీకే ఫైల్స్, డిజిటల్ అరెస్ట్, నకిలీ ఓటీపీల వంటి వివిధ రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే యాప్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్‌స్టాల్ చేయవద్దని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు