వందే భారత్‌లో ప్రయాణించిన సోనూ సూద్.. గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం!

ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక, విలాసవంతమైన రైలు ప్రయాణం ఆయనను ఒక్కసారిగా తన పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. ఒకప్పుడు నటుడిగా అవకాశాల కోసం ముంబై మహానగరంలో కష్టాలు పడుతున్న సమయంలో, రైళ్లలో తాను చేసిన ప్రయాణాలను గుర్తుచేసుకుంటూ సోనూ సూద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో భారతీయ రైల్వేల అభివృద్ధి అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ, ఈ ప్రయాణం తన జీవిత గమనాన్ని, నాడు పడిన కష్టాలను మరోసారి గుర్తు చేసిందని ఆయన పేర్కొన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక ప్రత్యేక వీడియోను పంచుకుంటూ సోనూ సూద్ తన నాటి చేదు అనుభవాలను వివరించారు. నాగ్‌పూర్‌లో చదువు పూర్తి చేసుకుని, నటుడిని కావాలనే పెద్ద కలలతో మొదటిసారి ముంబైకి రైలులోనే బయల్దేరానని చెప్పారు. అప్పట్లో జనరల్ బోగీల్లో కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేక, టాయిలెట్ బయట ఉండే ఖాళీ స్థలంలో న్యూస్ పేపర్లు పరుచుకుని పడుకుని ఎన్నో రాత్రులు గడిపానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు వందే భారత్‌లో ప్రయాణిస్తుంటే ఇక్కడి ప్రయాణ నాణ్యత, అందించే ఆహారం, సిబ్బంది చూపిస్తున్న ప్రేమ ఎంతో అద్భుతంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు.

ఇన్నేళ్ల తర్వాత భారతీయ రైల్వేల నాణ్యత, మౌలిక సదుపాయాలు ఎంతగానో పెరిగాయని సోనూ సూద్ కొనియాడారు. ఇప్పుడు రైళ్లలో టాయిలెట్ దగ్గర పేపర్లపై పడుకోవాల్సిన అవసరం లేదని, అంతా చాలా మారిపోయిందని చెప్పారు. దేశంలోని కోట్లాది మంది సామాన్యుల రోజువారీ ప్రయాణాన్ని, వారి జీవన నాణ్యతను మెరుగుపరిచినందుకు, ఇంతటి అద్భుతమైన మార్పును తీసుకొచ్చినందుకు కేంద్ర రైల్వే శాఖకు ఆయన ట్విట్టర్ (X) వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు