భూవివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ‘హైడ్రా’ (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధిస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నడుచుకున్నందుకు గానూ న్యాయస్థానం ఈ కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మండలం, యూసఫ్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండెకరాల భూవివాదంపై మహ్మద్ షఫాహతుల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం గతంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు అక్కడ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేసి, కొత్తగా కంచె ఏర్పాటు చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చినా ‘హైడ్రా’ యంత్రాంగం స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘనను తప్పుబడుతూ కమిషనర్‌కు జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌కు చెల్లించాలని, ఆ రసీదును సమర్పించిన తర్వాతే ఈ కేసులో హైడ్రా తరపు కౌంటర్ అఫిడవిట్‌ను స్వీకరించాలని రిజిస్ట్రీని న్యాయస్థానం ఆదేశించింది.








