వ్యాపార ప్రపంచంలోనే కాకుండా మానవ చరిత్రలోనే ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘స్పేస్ ఎక్స్’ (SpaceX) అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా $1.8 ట్రిలియన్ల రికార్డు వాల్యుయేషన్‌తో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూ (IPO)కి వచ్చింది. ప్రతి షేరు ధరను $135గా నిర్ణయించిన ఈ ఐపీఓ.. మానవ చరిత్రలోనే అతి పెద్దదిగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన చమురు సంస్థ సౌడీ అరామ్కో రికార్డులను కూడా ఇది అధిగమించింది. ఈ అసాధారణ విజయంతో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ట్రిలియనీర్‌గా రికార్డుకెక్కారు.
ఈ అద్భుత సామ్రాజ్యానికి పునాది 24 ఏళ్ల క్రితం రష్యాలో ఎదురైన ఒక అవమానమేనని చెప్పాలి. 2002వ సంవత్సరంలో ఎలాన్ మస్క్ అంగారక గ్రహంపైకి ఒక గ్రీన్‌హౌస్‌ను పంపాలనే వినూత్న ఆలోచనతో పాత ఐసీబీఎమ్ (ICBM) క్షిపణులను కొనుగోలు చేయడానికి రష్యా వెళ్లారు. అయితే అక్కడ రష్యన్ అధికారులు ఆయనను ఒక జోకర్లా చూసి, ఒక పాత పనికిరాని రాకెట్‌కు ఏకంగా $8 మిలియన్ల ధర చెప్పి గదిలో నుంచి బయటకు పంపేశారు. ఆ అవమానంతో స్వదేశానికి తిరిగొస్తున్న విమానంలోనే మస్క్ ఒక నిర్ణయానికి వచ్చారు. రాకెట్ నిర్మాణంలో అంతకుముందు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ.. రష్యా కోట్ చేసిన ధర కంటే చాలా తక్కువ ఖర్చుతో తానే సొంతంగా రాకెట్ నిర్మించగలనని గ్రహించి, తన సొంత డబ్బు $100 మిలియన్లతో స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించారు.
స్పేస్ ఎక్స్ ప్రారంభమైన కొత్తలో వరుసగా మూడు రాకెట్ ప్రయోగాలు విఫలమై, 2008 నాటికి మస్క్ పూర్తిగా దివాలా తీసే స్థితికి చేరారు. అయితే, చివరి ప్రయత్నంగా చేసిన నాలుగో రాకెట్ ప్రయోగం అత్యంత విజయవంతం కావడంతో నాసా నుండి $1.6 బిలియన్ల భారీ కాంట్రాక్ట్ దక్కింది. అక్కడి నుండి స్పేస్ ఎక్స్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాజాగా జరిగిన స్పేస్ ఎక్స్ ఐపీఓ ఎంతటి సంచలనం సృష్టించిందంటే.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ నాస్డాక్ సైతం ఈ కంపెనీ కోసం తన లిస్టింగ్ నిబంధనలను పక్కనబెట్టి నేరుగా ఇండెక్స్ ఫండ్లలోకి అనుమతించింది. ప్రస్తుతం ఐపీఓ తర్వాత కంపెనీలో 82 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ పవర్‌ను మస్క్ తన నియంత్రణలోనే ఉంచుకున్నారు. ఆనాడు మస్క్‌ను చూసి నవ్విన రష్యా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ విలువ నేడు సుమారు $2 ట్రిలియన్లుగా ఉంటే, మస్క్ ఒంటరిగా నిర్మించిన స్పేస్ ఎక్స్ విలువ $1.8 ట్రిలియన్లకు చేరడం విశేషం.









