అమెరికా – ఇరాన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా త్వరలోనే చారిత్రాత్మక శాంతి ఒప్పందం కురవబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, ఈ ప్రక్రియలో ఇరాన్ కొత్త మెలిక పెట్టింది. విదేశాల్లో స్తంభింపజేసిన తమకు చెందిన 24 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని, అందులో సగం అంటే 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.13 లక్షల కోట్లు) చర్చలు ప్రారంభం కావడానికి ముందే తమకు అందుబాటులోకి తీసుకురావాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం తమ సొమ్ము తమకు ఇచ్చిన తర్వాతే అధికారిక చర్చలు ఉంటాయని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది.
ఇరు దేశాల మధ్య మొత్తం 14 అంశాలపై ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం సహా కీలక అంశాలపై విస్తృత చర్చలు మొదలు కావడానికి ముందే ఈ ఆస్తుల విడుదలకు అమెరికా అంగీకరించిందని ఇరాన్ మీడియా పేర్కొంటుండగా, అమెరికా మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చింది. ఇరాన్ ముందుగా ఒప్పందంలోని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అప్పటివరకు నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని ఒక సీనియర్ అమెరికా అధికారి స్పష్టం చేస్తూ.. ఇది పూర్తిగా పనితీరు ఆధారంగా మాత్రమే సాగే ఒప్పందం అని తేల్చి చెప్పారు.
ఈ నిధుల వివాదం ఎలా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలు ఈ శాంతి ప్రయత్నాలను ముక్తకంఠంతో స్వాగతిస్తున్నాయి. ఈ ఒప్పందం విజయవంతమైతే యుద్ధం కారణంగా నిలిచిపోయిన హర్మూజ్ జలసంధి రవాణా పూర్తిగా తెరుచుకోనుంది. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలు కూడా ఇరాన్ సానుకూల చర్యలు తీసుకుంటే ఆ దేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. మరోవైపు, దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లాపై దాడులకు తమకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ఇజ్రాయెల్ పట్టుబట్టినప్పటికీ, అందుకు అమెరికా నిరాకరించినట్లు సమాచారం.









