తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రసక్తే లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రగతికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రాజకీయ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారుల ఓట్ల విషయంలో కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
గత పన్నెండేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 10 లక్షల కోట్లు కేటాయించిందని బండి సంజయ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన కార్పొరేషన్ల మౌలిక వసతుల అభివృద్ధికి వేల కోట్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత వేగంగా దూసుకుపోవాలంటే ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అవసరమని పేర్కొంటూ, ఈసారి ఎన్నికల్లో ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇదే సమయంలో మావోయిస్టుల అంశంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో తుపాకీ సంస్కృతి, మారణహోమంతో సాధించేది ఏమీ లేదన్నారు. ఏమీ తెలియని మైనర్ పిల్లల చేత ఆయుధాలు పట్టించడం అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు ప్రధాన స్రవంతిలో కలిసి లొంగిపోయారని, ఇంకా ఆ పాత ఆలోచనల్లోనే ఉన్నవారు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం మనసు మార్చుకుని సమాజంలోకి తిరిగి రావాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.









