తెలంగాణలోని హన్మకొండలో పవన్ కల్యాణ్ పర్యటన: అభిమాని ఇంట భావోద్వేగ క్షణాలు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం తెలంగాణలోని హన్మకొండలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక హనుమాన్ నగర్‌కు చెందిన 15 ఏళ్ల నిరంజన్ అనే బాలుడిని పరామర్శించారు. తీవ్రమైన నరాల సమస్య కారణంగా ఆ బాలుడు కేవలం రెండు, మూడేళ్ల పిల్లాడిలాగే కనిపిస్తూ, కాళ్లు పక్షవాతానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. జీవితంతో పోరాడుతున్న ఆ చిన్నారికి తన ఆరాధ్య నటుడు పవన్ కల్యాణ్‌ను కలిసి, ఆయన ముందే ఒక సినిమా డైలాగ్ చెప్పాలనేది చిరకాల కోరిక కావడంతో, డిప్యూటీ సీఎం నేరుగా బాలుడి నివాసానికి వెళ్లి ఆత్మీయంగా పలకరించారు.

ఈ సందర్భంగా నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని, అతనికి అందుతున్న వైద్య చికిత్స వివరాలను పవన్ కల్యాణ్ వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. తనను కలవాలనే అభిమాని చివరి కోరికను నెరవేర్చి, ఆ కుటుంబానికి అధైర్యపడవద్దంటూ ప్రభుత్వం మరియు వ్యక్తిగత తరఫున పూర్తి భరోసా కల్పించారు. మెగాస్టార్ తమ్ముడు, జనసేన అధినేతను తమ ప్రాంతంలో స్వయంగా చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో హన్మకొండ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

ఈ భావోద్వేగ భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ హన్మకొండలోని చారిత్రక ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత స్థానిక రిసార్ట్‌లో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే లంచ్ ముగించుకున్న తర్వాత ఆయన రోడ్డు మార్గాన నేరుగా విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు