మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సుమారు రూ.1,167 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ (UGD) వ్యవస్థ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ బృహత్తర ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో రెండు దశలుగా చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.1,167.50 కోట్లు కాగా.. మొదటి దశ పనులకు రూ.604.32 కోట్లు, రెండో దశకు రూ.563.18 కోట్లను కేటాయించారు. రాజధాని ప్రాంత పరిధిలోని బేతపూడి, నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి మినహా మిగిలిన ఎంటీఎంసీ ప్రాంతమంతా ఈ ఆధునిక డ్రైనేజీ ప్రాజెక్టు పరిధిలోకి రానుంది. తమ దశాబ్దాల నాటి చిరకాల వాంఛ నెరవేరుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులో భాగంగా మొత్తం 531 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. ఇందులో ఫేజ్-1లో 300 కి.మీ., ఫేజ్-2లో 231 కి.మీ. మేర పనులు చేపడతారు. మురుగునీటిని శాస్త్రీయంగా శుద్ధి చేసేందుకు రోజుకు 47.51 మిలియన్ లీటర్ల (MLD) సామర్థ్యం గల మొత్తం 20 మురుగునీటి శుద్ధి కేంద్రాలను (STP) ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 18 లిఫ్ట్ స్టేషన్లను కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు గడువులోగా పూర్తయితే మంగళగిరి-తాడేపల్లి ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారడంతో పాటు, ప్రజారోగ్యానికి గట్టి భరోసా లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.







