‘మా ఇంటి బంగారం’తో సమంతకు జాక్‌పాట్: విడుదలకు ముందే భారీ లాభాలు!

సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, తన సొంత బ్యానర్ ‘ట్రాలాల మూవింగ్ పిక్చర్స్’ పతాకంపై నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనానికి తెరతీసింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా.. థియేట్రికల్ రన్‌కు ముందే పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టడమే కాకుండా భారీ లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ప్రతిభావంతురాలైన దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంపై మార్కెట్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సుమారు రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మధ్య బడ్జెట్‌తో నిర్మించారు. అయితే సమంతకున్న క్రేజ్, కమర్షియల్ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో నాన్-థియేట్రికల్ హక్కులకు మార్కెట్లో ఊహించని డిమాండ్ ఏర్పడింది. ఓటీటీ (డిజిటల్), శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలోనే ఈ చిత్రం దాదాపు రూ. 35 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారానే సమంతకు విడుదలకు ముందే దాదాపు రూ. 10 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ అందినట్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. రిలీజ్ వారంలోనే వ్యాపార ఒప్పందాలు విజయవంతంగా క్లోజ్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా సేఫ్ జోన్‌లోకి వచ్చేసింది.

సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి, సీనియర్ నటి గౌతమితో పాటు వర్సటైల్ యాక్టర్ గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. సమంతతో గతంలో ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ చిత్రాలు తెరకెక్కించిన నందిని రెడ్డి, ‘మా ఇంటి బంగారం’తో మరోసారి ఆమెను డైరెక్ట్ చేశారు. తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నందిని రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో సమంతను పది రెట్లు ఎక్కువ పవర్‌ఫుల్‌గా చూస్తారని, ఇది తన ప్రామిస్ అని ధీమా వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద విడుదలకు ముందే లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం, థియేటర్లలో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు