దంబుల్లా వేదికగా జరిగిన భారత్-ఏ, శ్రీలంక-ఏ ట్రై-సిరీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర సంచలనంగా మారింది. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ సమర్పించిన నివేదిక ఆధారంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించిన లంక స్పిన్నర్ విషెన్ హలంబగేపై శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఇది ‘ఏ’ జట్ల సిరీస్ కావడంతో ఐసీసీ ప్రమేయం లేకుండా లంక బోర్డే నేరుగా ఈ చర్యలు తీసుకుంది. అలాగే, ఈ మ్యాచ్‌లో అతిగా అప్పీల్ చేసినందుకు గానూ సీనియర్ వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు కూడా బోర్డు భారీ జరిమానా విధించింది.
సూపర్ ఓవర్‌లో భారత్ ఓడిపోయిన అనంతరం నిరాశతో వెనుతిరుగుతున్న 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూ హలంబగే తీవ్రమైన స్లెడ్జింగ్‌కు దిగడమే ఈ గొడవకు కారణమైంది. “మ్యాచ్ అయిపోయింది.. ఇక ఇంటికి వెళ్లు, ఇది ఐపీఎల్ కాదు” అంటూ హలంబగే అవహేళన చేయడంతో వైభవ్ సహనం కోల్పోయి అతడిని వెనక్కి నెట్టివేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందిస్తూ, భారత ఆటగాళ్లు ఇలాంటి విషయాల వల్ల దృష్టి మరల్చుకోకుండా కేవలం టోర్నమెంట్‌పైనే శ్రద్ధ పెట్టాలని సూచించారు. లంక ఆటగాడి స్లెడ్జింగ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తడంతో, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా క్లీన్ చిట్ ఇచ్చింది.







