మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలై రెండు వారాలు ముగిసినప్పటికీ ఈ సినిమా థియేటర్లలో తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో వసూళ్లు కొద్దిగా నెమ్మదించినప్పటికీ, ఓవరాల్ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ చిత్రం సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. రెండు వారాల్లో (14 రోజుల్లో) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 320.20 కోట్ల రూపాయల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 14వ రోజున ఈ చిత్రం ఇండియాలో రూ. 2.45 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇందులో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే రూ. 2.03 కోట్ల నెట్ వసూళ్లు రావడం విశేషం. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ ఈ సినిమాకు స్థిరమైన వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ‘పెద్ది’ తన హవా చాటుతూ రూ. 52.45 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. రామ్ చరణ్ కెరీర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత భారతదేశంలో 200 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటిన రెండో చిత్రంగా ‘పెద్ది’ సరికొత్త చరిత్ర సృష్టించింది.
జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సూర్య నటించిన ‘కరుప్పు’ మరియు చిరంజీవి గత చిత్రాల రికార్డులను సైతం అధిగమించి, ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ వన్ చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. థియేటర్లలో కొన్ని కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ, ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన ఈ చిత్రం విజయవంతంగా తన కలెక్షన్ల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.









