భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ ప్రముఖ డిజిటల్, టెలికాం దిగ్గజం ‘జియో ప్లాట్‌ఫామ్స్’ ఐపీఓ (IPO)కు వెళ్లేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధినేత ముకేశ్ అంబానీ ఈ మెగా ఐపీఓ ప్రకటనను స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ రోజే సెబీ (SEBI)కి సమర్పించబోతున్నామని, తన వారసులు ఆకాశ్, ఈశా, అనంత్ అంబానీలు ఈ ఐపీఓ ప్రక్రియను ముందుండి నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ జియో ఐపీఓ విలువ సుమారు రూ.33,600 కోట్లుగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ ప్రకారం.. రిలయన్స్ జియో మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.15,12,000 కోట్లుగా ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధికంగా ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ (రూ. 27,870 కోట్లు) రికార్డును అధిగమించి, ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా అవతరించబోతోంది. గ్లోబల్ స్థాయిలో సాంకేతిక కంపెనీలను భారత్ నిర్మించగలదని ఈ జియో లిస్టింగ్ ప్రపంచానికి నిరూపిస్తుందని ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో ‘డిజిటల్ అసమానతలను’ తొలగించాలనే లక్ష్యంతో ప్రారంభమైన జియో, పదేళ్ల కాలంలో వాయిస్ కాల్స్ ఉచితం చేసి హై-స్పీడ్ డేటాను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్ 52.40 కోట్ల మంది ఖాతాదారులతో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా కొనసాగుతోంది. ఇందులో కేవలం 5జీ నెట్‌వర్క్‌ను వాడుతున్న వారి సంఖ్యే 26.80 కోట్లుగా ఉండగా, వారి సరికొత్త హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ‘జియో ఎయిర్ ఫైబర్’ ఇప్పటికే 1.30 కోట్ల ఇళ్లకు కనెక్ట్ అయి అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది.









