ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుతున్న వ్యాపార సంస్థలు తమకు తెలియకుండానే రెండుసార్లు భారీ మూల్యం చెల్లిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకటి టెక్నాలజీ కొనుగోలు కోసం డబ్బు రూపంలో చెల్లిస్తుండగా, రెండోది అంతకంటే అత్యంత విలువైన తమ సొంత యాజమాన్య, సంస్థాగత పరిజ్ఞానాన్ని (Proprietary Knowledge) కోల్పోవడం ద్వారా అని ఆయన తన వ్యక్తిగత బ్లాగ్‌లో విశ్లేషించారు. ఏఐ మోడళ్లు మరింత మెరుగ్గా పనిచేయాలనే ఉద్దేశంతో కంపెనీలు తమ అంతర్గత సమాచారాన్ని వాటికి అందిస్తున్నాయని, ఈ క్రమంలో తమ మేధో సంపత్తిని వేరే వాళ్లకు అప్పగిస్తున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విచిత్రమైన పరిస్థితిని వివరించడానికి నాదెళ్ల.. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త కెన్నెత్ ఆరో ప్రతిపాదించిన ‘ఇన్ఫర్మేషన్ పారడాక్స్’ (సమాచార వైరుధ్యం) సిద్ధాంతాన్ని ఉదహరించారు. ఆరో సిద్ధాంతం ప్రకారం ఒక సమాచారం యొక్క అసలు విలువ ఏంటో తెలియకుండా కొనుగోలుదారు దాన్ని కొనలేడు, కానీ ఒకసారి ఆ సమాచారం తెలిశాక దాని కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, ప్రస్తుత ఏఐ యుగంలో ఈ సమస్య పూర్తిగా తలకిందులై ‘రివర్స్ ఇన్ఫర్మేషన్ పారడాక్స్’గా రూపాంతరం చెందిందని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఇక్కడ కొనుగోలు చేసిన ఏఐ సాధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసమే.. వాడుకదారులైన కంపెనీలు తమ విలువైన పరిజ్ఞానాన్ని తిరిగి ఆ ఏఐ ప్రొవైడర్‌కే (విక్రేతకు) ఉచితంగా అప్పగించాల్సి వస్తోందని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర సమాచార అసమానతలు తలెత్తుతాయని హెచ్చరించారు.
ఈ డిజిటల్ ముప్పు నుండి బయటపడటానికి కంపెనీలు తమ ‘లెర్నింగ్ లూప్’ (learning loop)పై పూర్తి నియంత్రణ సాధించాలని మణిపాల్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన నాదెళ్ల ప్రత్యేకంగా సూచించారు. ఉద్యోగులు ఏఐకి ఇచ్చే ప్రతి ప్రాంప్ట్, తప్పులను సరిదిద్దే విధానాలు మరియు అంతర్గత వర్క్‌ఫ్లోలు వంటివన్నీ సంస్థ యొక్క భవిష్యత్తు పోటీతత్వాన్ని నిర్ణయిస్తాయని, వాటి రక్షణ కోసం ఒక కొత్త ‘ట్రస్ట్ బౌండరీ’ (విశ్వసనీయత సరిహద్దు) ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే వ్యాపార సంస్థలు కేవలం ఒకే ఏఐ ప్రొవైడర్‌పై ఆధారపడకుండా (Vendor Lock-in), వేర్వేరు ఏఐ మోడళ్ల మధ్య సులభంగా మారగలిగేలా మల్టీ-మోడల్ వ్యవస్థలను నిర్మించుకోవడం ద్వారా వ్యయాలను అదుపులో ఉంచుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.








