మన సంస్కృతి వల్లే భారత్‌కు విశ్వగురు స్థానం: సీఎం చంద్రబాబు

మన మహోన్నత సంస్కృతి, విలువల వల్లే భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ వారసత్వాన్ని కాపాడుకుని, భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉండవల్లి గుహల వద్ద యోగా గురు బాబా రాందేవ్‌ నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. యోగాంధ్ర లోగోతో ఉన్న చొక్కా ధరించి, రాందేవ్‌ ప్రదర్శించిన చక్రాసనం, వృశ్చికాసనం, మయూరాసనం వంటి కఠినమైన ఆసనాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “బాబా రాందేవ్‌తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన యోగాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. టెక్నాలజీ వ్యసనంగా మారకుండా ఉండాలంటే, దానికి యోగా, ఆధ్యాత్మికత వంటివి జోడించాలి,” అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే చారిత్రక ఉండవల్లి గుహల వద్ద ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కృషితో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, ఆధ్యాత్మికతతో కూడిన వికసిత్ భారత్ సాధనలో ప్రధానికి అండగా నిలుస్తామని చెప్పారు.

రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం కోసం ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇందులో రోగ నివారణకు పెద్దపీట వేస్తూ యోగా, ప్రాణాయామం వంటి వాటిని చేర్చుతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచడంతో పాటు, 20 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నామని, రసాయన రహిత పంటల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కాలుష్య రహిత, నివాస యోగ్య నగరంగా, అభివృద్ధి, ఆధ్యాత్మికత, పర్యాటకానికి పెద్దపీట వేస్తూ ప్రజా రాజధాని అమరావతిని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన పునరుద్ఘాటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు