యూఏఈలోని భారతీయులకు గమనిక.. 5 రోజులు పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న భారత పౌరులకు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. పాస్‌పోర్ట్, వీసా, అటెస్టేషన్ వంటి సాధారణ కాన్సులర్ సేవలు ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని ఎంబసీ స్పష్టం చేసింది.

ఈ సేవల నిర్వహణ బాధ్యతలను కొత్త సంస్థకు అప్పగిస్తున్న నేపథ్యంలో ఈ తాత్కాలిక మార్పులు చేపట్టినట్లు ఎంబసీ వివరించింది. ప్రస్తుతం పాస్‌పోర్ట్, వీసా సేవలు అందిస్తున్న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్, అటెస్టేషన్ సేవలను పర్యవేక్షిస్తున్న ఎస్‌జీఐవీఎస్ గ్లోబల్ సంస్థలు జూన్ 25వ తేదీతో తమ కార్యకలాపాలను ముగించనున్నాయి. జూలై 1వ తేదీ నుంచి, కొత్తగా నియమించిన ‘అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎల్ఎల్‌సీ’ యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌లో గల మొత్తం 16 కేంద్రాల ద్వారా ఈ సేవలను అందించనుంది.

సేవల మార్పిడి ప్రక్రియ కొనసాగే సమయంలో అత్యవసర కాన్సులర్ సేవల కోసం ప్రజలు నేరుగా అబుదాబిలోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. యూఏఈలో 35 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తున్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, అత్యవసర దరఖాస్తులను జూన్ 25వ తేదీలోపు సమర్పించాలని అధికారులు పౌరులకు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు