బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం నాడు సంచలన ప్రకటన చేశారు. కొంతకాలంగా పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, అధికార లేబర్ పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలు, సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎక్కువ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ ప్రధాని కార్యాలయం ’10 డౌనింగ్ స్ట్రీట్’ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజీనామా నిర్ణయాన్ని బ్రిటన్ రాజుకు అధికారికంగా తెలియజేశానని, కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు తాత్కాలికంగా బాధ్యతల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు.
జూలై 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లేబర్ పార్టీని భారీ విజయం వైపు నడిపించిన కీర్ స్టార్మర్, బ్రిటన్ 58వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు ముగింపు పలికి, దేశంలో సరికొత్త మార్పులు తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. మొదట్లో ప్రభుత్వానికి భారీ ప్రజా మద్దతు లభించినప్పటికీ.. ఆ తర్వాతి కాలంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడంలో, ప్రజా సేవలను మెరుగుపరచడంలో ఎదురైన సవాళ్లు మరియు పార్టీలో రేగిన అంతర్గత అసంతృప్తి కారణంగా ఆయనపై ఒత్తిడి తీవ్రమై చివరకు రాజీనామాకు దారితీసింది.
కీర్ స్టార్మర్ రాజీనామా నేపథ్యంలో బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేబర్ పార్టీలో ఆండీ బర్న్‌హామ్‌కు దాదాపు 300 మందికి పైగా పార్లమెంట్ సభ్యుల (MPs) మద్దతు ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబరులో జరగబోయే తదుపరి పార్లమెంట్ సమావేశాల కంటే ముందే కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియను పూర్తి చేయాలని స్టార్మర్ పార్టీ జాతీయ కార్యవర్గాన్ని కోరారు. ఒకవైపు లేబర్ పార్టీ ప్రజాదరణ తగ్గుతుండటం, మరోవైపు నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని ‘రిఫార్మ్ యూకే’ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న తరుణంలో బ్రిటన్ రాజకీయాల్లో ఈ పరిణామం తీవ్ర సంచలనంగా మారింది.









