తుంగభద్రలో అడుగంటుతున్న నీళ్లు… కడప జిల్లాలో సాగునీటి సంక్షోభం!
కడప జిల్లాలో PBC, చిత్రావతి రిజర్వాయర్‌కు నీటి కష్టాలు! చిత్రావతి రిజర్వాయర్ ఇన్‌ఫ్లో సున్నా.
రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. దీని ప్రభావం తుంగభద్ర హైలెవల్ కెనాల్ (TBP-HLC) ఆయకట్టుతో పాటు కడప జిల్లాలోని సాగునీటి పథకాలపై పడే ప్రమాదం ఉంది.తుంగభద్రలో వారం రోజుల్లోనే 6.927 TMC నీరు తగ్గిపోవటం గమనార్హం.
కాగా అక్టోబర్ 8న 64.745 TMC ఉన్న నీటి నిల్వలు అక్టోబర్ 15 నాటికి 57.818 TMCకి పడిపోయాయి. గత ఏడాది ఇదే రోజున 80.003 TMC నీరు ఉండగా, ప్రస్తుతం 22.185 TMC తక్కువగా ఉంది. జలాశయానికి కొత్తగా ఇన్‌ఫ్లో రావడం లేదు
HLC ద్వారా ఏపీకి తగ్గుతున్న నీటి ప్రవాహం!
తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా ఏపీ సరిహద్దు వద్ద అక్టోబర్ 8న 1,520 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, అక్టోబర్ 15న 1,205 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం HLC ద్వారా వస్తున్న నీటిని ప్రధానంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (PABR), మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (MPR)లో భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం నిల్వ చేస్తున్నారు. మరోవైపు ఏపీ సరిహద్దులోని కణేకల్లు ప్రాంతంలో కొంత ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.
కడప జిల్లాలో PBC, చిత్రావతి రిజర్వాయర్‌కు నీటి కష్టాలు!
PABR, MPR నుంచి దిగువ కాలువలకు తగినంత నీటి విడుదలలు లేకపోవడంతో పులివెందుల బ్రాంచ్ కెనాల్ (PBC), చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (CBR)కు నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. చిత్రావతి రిజర్వాయర్‌కు గండికోట నీరే ప్రత్యామ్నాయంగా మారనుంది. చిత్రావతి రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 10.229 TMC కాగా, అక్టోబర్ 14 నాటికి కేవలం 3.28 TMC మాత్రమే నిల్వ ఉంది. అంటే మొత్తం సామర్థ్యంలో 32% మాత్రమే ఇన్‌ఫ్లో లేనట్టే.
రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. మిగిలిన నీటిలో కొంత భాగం పులివెందుల ప్రాంత తాగునీటి అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఈ 3.28 TMC మొత్తాన్ని వినియోగించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.
చిత్రావతికి సహజ ప్రవాహాలు కూడా కరువే!
చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో, ముఖ్యంగా కర్ణాటక ఎగువ ప్రాంతాలతో పాటు స్థానికంగా కూడా సరైన వర్షాలు కురవలేదు. సాధారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడే చిత్రావతి నదిలో గణనీయమైన సహజ ప్రవాహాలు కనిపిస్తాయి. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిజర్వాయర్‌కు సహజంగా నీరు చేరడం లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు గండికోట జలాశయం నుంచి నీటిని తరలించడం కీలక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అక్టోబర్ 14 నాటికి గండికోట రిజర్వాయర్‌లో 26.85 TMC సామర్థ్యానికి 18.81 TMC నిల్వ ఉంది. అయితే గండికోట నుంచి చిత్రావతికి నీటిని తరలించాలంటే అందుబాటులో ఉన్న నీరు, పంపింగ్ వ్యవస్థ, ఇతర అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
కడపలో 52.1% వర్షపాతం లోటు… భూగర్భ జలాల పరిస్థితి మరింత ఆందోళనకరం!
వైఎస్సార్ కడప జిల్లాలో అక్టోబర్ 14 నాటికి సాధారణంగా 470 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 224.9 మి.మీ. మాత్రమే నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి భూగర్భ జలమట్టం సగటున 9.45 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 14.14 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే 4.69 మీటర్ల క్షీణతగా నమోదయింది
ఒకవైపు వర్షాభావం… మరోవైపు తుంగభద్రలో తగ్గుతున్న నీటి నిల్వలు… ఇంకోవైపు చిత్రావతికి నిలిచిన ఇన్‌ఫ్లో!
ఈ పరిస్థితుల్లో కడప జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడం, పులివెందుల ప్రాంతానికి తాగునీటి భద్రత కల్పించడం అత్యంత కీలకంగా మారింది.
Post Views: 2









