తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజీ ఆన్‌స్క్రీన్ జంటగా పేరొందిన దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషల మధ్య స్నేహబంధం ముగిసిందంటూ కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నిన్న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ విజయ్‌కు సంబంధించిన విషయాల్లో ముందుండే త్రిష, ఈసారి కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా పూర్తిగా మౌనం పాటించడం అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకోబోతున్నారని, ఆ తర్వాతే త్రిషతో కొత్త జీవితాన్ని పంచుకుంటారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం విజయ్, ఆయన భార్య సంగీత మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోయాయని, వారిద్దరూ మళ్లీ కలిసి హ్యాపీగా ఉంటున్నారని చెన్నై మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
కుటుంబంతో విజయ్ మళ్లీ తిరిగి కలిసిపోవడంతోనే, త్రిష ఈ బంధం నుంచి గౌరవంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పర్సనల్ లైఫ్‌ను చక్కదిద్దుకుంటున్న విజయ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఈ పుట్టినరోజున దూరంగా ఉంటూ మౌనం వహించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పెళ్లి పీటల వరకు వెళ్తుందని ఆశించిన ఈ క్రేజీ జోడీ స్నేహానికి దాదాపు ముగింపు పడినట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.









