మిడిల్ ఈస్ట్‌లో వంద రోజులకు పైగా సాగిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన శాంతి చర్చలతో తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే, ఇరు దేశాల మధ్య ఈ శాంతి ఒప్పందం కుదరడంలో ఖతార్‌తో కలిసి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ పాత్రపై ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ దౌత్య ప్రయత్నాలను ప్రశంసించిన కొద్ది రోజులకే.. అమెరికాకు చెందిన అధికార రిపబ్లికన్ సెనేటర్లే పాక్ తీరుపై విమర్శల వర్షం కురిపించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
స్విట్జర్లాండ్ వేదికగా శాంతి ఒప్పంద చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, తుది ఒప్పందానికి సంబంధించిన కీలక చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షిహీ సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో ప్రశ్నలు లేవనెత్తారు. ఖతార్, పాకిస్థాన్‌లకు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన నల్లటి చరిత్ర ఉందని, దశాబ్దాలుగా ఇరాన్ సాగిస్తున్న ఉగ్రవాద కార్యక్రమాలకు ఈ దేశాలు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోందని సెనేటర్ రిక్ స్కాట్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో బహిరంగంగా ఆరోపించారు.
మరో సెనేటర్ టిమ్ షిహీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను దాదాపు పదేళ్ల పాటు తన దేశంలోనే దాచిపెట్టిన చరిత్ర పాకిస్థాన్‌దని గుర్తు చేశారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI) ద్వారా ఇరాన్‌కు, అలాగే అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన పలు తిరుగుబాట్లకు నిరంతరం మద్దతు లభించిందని, అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న దేశం నిష్పాక్షపాతంగా మధ్యవర్తిత్వం వహిస్తుందని నమ్మడం ముమ్మాటికీ తప్పని తేల్చి చెప్పారు. ఇరాన్ చర్చల్లో పాక్‌ను పక్కనబెట్టి, అమెరికాకు నిజమైన మిత్రదేశాలైన ఇజ్రాయెల్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలకు భాగస్వామ్యం కల్పించాలని ట్రంప్ యంత్రాంగానికి రిపబ్లికన్ సెనేటర్లు గట్టిగా సూచిస్తున్నారు.









