మహారాష్ట్రలోని పూణే సమీపంలో గల ప్రసిద్ధ లోహ్‌గఢ్ కోట వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్‌ను 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసి చంపిన కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ పక్కా ప్లాన్ మర్డర్ మిస్టరీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు చేతన్ చౌదరి తండ్రి బాబూలాల్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకును వెనకేసుకొచ్చారు. తన కుమారుడు పూర్తిగా నిరపరాధి అని, సహ నిందితురాలైన 20 ఏళ్ల సియా గోయల్ తనను తాను కాపాడుకోవడానికి చేతన్‌ను ఈ కేసులో దారుణంగా ఇరికించిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఘటన జరిగినప్పుడు తాను కేతన్, సియాలకు చాలా దూరంలో నిలబడ్డానని చేతన్ పోలీస్ స్టేషన్‌లో ఏడుస్తూ చెప్పాడని, తమకు ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యులు చేతన్ నిర్దోషి అని చెప్తున్నప్పటికీ.. పూణే రూరల్ పోలీసులు మాత్రం పక్కా సాంకేతిక ఆధారాలతో నిందితుల గుట్టు రట్టు చేశారు. జూన్ 18వ తేదీన పూణేలో ఎండ తీవ్రత 33 డిగ్రీలుగా ఉన్నప్పటికీ, అంతటి వేడిలోనూ చేతన్ చౌదరి తలకు ‘హుడీ’, షార్ట్స్, హెడ్‌సెట్ ధరించి కోటపై కేతన్, సియాలను వెంబడించడం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. కోటపై నడుస్తున్నప్పుడు సియా వెనక్కి తిరిగి చూసిన వెంటనే చేతన్ కింద కూర్చోవడం, చేతి సంజ్ఞలతో మాట్లాడుకోవడం వంటివి సీసీటీవీలో నిరూపితం అయ్యాయి. అంతేకాకుండా, గడిచిన ఆరు నెలల్లోనే వీరిద్దరూ ఏకంగా 2 వేల సార్లకు పైగా మొత్తంగా 238 గంటలు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా రికార్డుల ద్వారా తేలింది.
నిజానికి కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్‌కు ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగ్గా.. ఈ ఏడాది నవంబర్‌లో జైపూర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే ప్రియుడైన చేతన్‌తో కలిసి జీవించాలనే ఉద్దేశంతో సియా, కేతన్‌ను చంపేందుకు గతంలోనే మూడు సార్లు విఫలయత్నం చేసింది. జూన్ 14న కోటపై నుంచి నెట్టేయగా కేతన్ ఒక చెట్టును పట్టుకుని బతికాడని, అప్పుడు పామును చూసి భయపడి నెట్టేశానంటూ సియా నమ్మించిందని పోలీసులు వెల్లడించారు. చివరకు జూన్ 18వ తేదీ ఉదయం పూణెలోని ఒక కేఫ్‌లో సియా, చేతన్ కలిసి పక్కా స్కెచ్ వేసి మరీ కేతన్‌ను కోటపై నుంచి తోసి హత్య చేశారు. ప్రస్తుతం పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది.









