ఒంటినిండా నకిలీ నగల గుట్టురట్టు: హైదరాబాద్ ‘గోల్డ్ మ్యాన్’ సూర్య భాయ్‌పై చీటింగ్ కేసులు!

సోషల్ మీడియాలో ఒంటినిండా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి, రీల్స్‌తో ‘గోల్డ్ మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్న పి. సురేశ్ కుమార్ అలియాస్ సూర్య భాయ్‌ అసలు రంగు బయటపడింది. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే దిగుమతి చేసుకున్న బంగారం ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు అతనిపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌లు తనకు అత్యంత సన్నిహితులని నమ్మించి అతను ఈ దందా సాగించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

బాధితుల ఫిర్యాదు ప్రకారం.. సూర్య భాయ్ తక్కువ ధరకే బంగారం ఇస్తానని ఒక వ్యక్తి నుండి రూ. 32 లక్షలు వసూలు చేసి ఆ తర్వాత పరారయ్యాడు. బాధితులు అతని ఇంటికి వెళ్లి నిలదీయగా, నమ్మబలికేందుకు మూడు ఐఫోన్లు ఇచ్చి, రూ. 20 లక్షలకు చెక్కు రాసిచ్చాడు. అయితే, కొద్దిరోజులకే బాధితులను బెదిరించి ఆ ఫోన్లను తిరిగి బలవంతంగా లాక్కున్నాడు. ఈ ఘోరంపై మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, తదుపరి సమగ్ర విచారణ నిమిత్తం కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఈ మోసాల దర్యాప్తులో భాగంగా సూర్య భాయ్‌కి సంబంధించిన మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్‌లో నివసించే 34 ఏళ్ల సూర్య భాయ్, తాను కోటి రూపాయల విలువైన బంగారు నగలు ధరిస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకున్నాడు. అయితే, గత మార్చిలో అతనిపై నిఘా పెట్టిన ఆదాయపన్ను (IT) శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో.. అతను ధరించిన ఆభరణాలన్నీ చౌకబారు లోహాలతో చేసిన నకిలీవని, వాటి అసలు విలువ కేవలం రూ. 3 లక్షలు మాత్రమేనని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అతని చేతిలో ఇంకా ఎవరైనా మోసపోయారా అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు