- ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి.
- వీడియో కాన్ఫరెన్స్ లో
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబ్యూరో.జూలై 29
టుడే 9 ప్రతినిధి
ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం–2026లో భాగంగా ఓటరు వివరాల సేకరణ (ఎన్యూమరేషన్) ఫారాల పంపిణీని నిర్ణీత గడువులోపు పూర్తి చేసి, ప్రతి అర్హత కలిగిన ఓటరికి ఫారం అందేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు పినపాక నియోజకవర్గం ఎన్నికల అధికారి, ఐటీడీఏ పీవో బి రాహుల్ ఐటిడిఏ కాన్ఫరెన్స్ హాలు నుంచి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటరు వివరాల సేకరణ (ఎన్యూమరేషన్) ఫారాలను బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) మాత్రమే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వ్యక్తులతో ఫారాల పంపిణీ చేపట్టరాదని ఆదేశించారు.
ప్రతి బీఎల్‌వో తన పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి అర్హత కలిగిన ఓటర్లకు ఫారాలను అందజేయడంతో పాటు, వాటిని సక్రమంగా నింపి నిర్ణీత గడువులోపు సమర్పించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫారాలను సమర్పించిన ఓటర్ల వివరాలనే ముసాయిదా ఓటరు జాబితాలో కొనసాగిస్తామని, అందువల్ల ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా తన ఫారాన్ని సమర్పించేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
అనంతరం పినపాక నియోజకవర్గం ఎన్నికల అధికారి బి రాహుల్ అధికారులతో మాట్లాడుతూ.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. బూర్గంపాడు మండలంలో సారపాక . 211,216,274,235, మణుగూరు మండలంలో 22,82,94,106,141,190, అశ్వాపురం మండలంలో 160,163,166,169 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ శాతం చాలావరకు తగ్గిందని బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు వివరాల సేకరణ (ఎన్యూమరేషన్) ఫారాలను పంపిణీ చేయడంతో పాటు, నిర్ణీత గడువులోపు వాటిని తిరిగి సేకరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫారాల పంపిణీ స్వీకరణ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను పిఓ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, పి వి టి జి అధికారి గన్యా, తహసిల్దార్లు నరేష్, రామకృష్ణ , సూర్య ప్రకాష్, ఎలక్షన్ డిటి అనూష, ఆర్ ఐ లీలావతి శాఖ సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.









