ఇది ప్రభాస్ రేంజ్.. బ్యాంకాక్ ఆసుపత్రిలో పూరి జగన్నాథ్‌కు దక్కిన వీఐపీ ట్రీట్‌మెంట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో విస్తరించిందో చెప్పే ఓ ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కేవలం ‘నేను ప్రభాస్ స్నేహితుడిని’ అని చెప్పినందుకు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌కు బ్యాంకాక్‌లోని ఓ ఆసుపత్రిలో ఊహించని రీతిలో వీఐపీ ట్రీట్‌మెంట్ లభించింది. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఇటీవల విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ అనే డాక్యుమెంటరీలో అభిమానులతో పంచుకున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న రోజుల్లో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ చిన్న ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స కోసం బ్యాంకాక్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వెయిటింగ్ రూమ్‌లో కూర్చుని ఉండగా, ఓ నర్స్ ఆయన వద్దకు వచ్చి ఇండియా నుంచి వచ్చారా అని అడుగుతూ ‘బాహుబలి?’ అని ప్రశ్నించింది. దానికి ఆశ్చర్యపోయిన పూరి జగన్నాథ్, తన ఫోన్‌లో ప్రభాస్‌తో కలిసి ఉన్న పర్సనల్ ఫొటోను చూపించి తాను అతనికి మంచి స్నేహితుడినని చెప్పారు. ఆ ఫొటో చూసిన నర్స్ వెంటనే ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేయడంతో, పూరి జగన్నాథ్‌కు ఎలాంటి వెయిటింగ్ సమయం లేకుండా నేరుగా ఒక ప్రత్యేక గదికి తీసుకెళ్లి తక్షణమే వైద్య సేవలు అందించారు.

జపాన్ వంటి దేశాల్లోనే కాకుండా బ్యాంకాక్‌లోని ఓ సాధారణ ఆసుపత్రిలో కూడా ‘బాహుబలి’ ప్రభావం ఈ స్థాయిలో ఉండటం చూసి అప్పట్లో ప్రభాస్, రాజమౌళి, శోభు యార్లగడ్డ సైతం ఆశ్చర్యపోయారు. కాగా, ఇదే డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్కలు ‘బాహుబలి 3’ చిత్రంపై పరోక్షంగా కొన్ని హింట్స్ ఇవ్వడం ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’, అలాగే ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు