“మా నీటి జోలికొస్తే చేతులు నరుకుతాం”.. భారత్‌కు పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ తీవ్ర హెచ్చరిక

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ‘సింధూ నదీజలాల ఒప్పందం’ వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాక్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌పై తీవ్ర పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం తమకు దక్కాల్సిన నీటి వాటాను అడ్డుకోవాలని భారత్ ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ.. “ఒకవేళ ఎవరైనా మా నీటి వాటాపై చేయి వేయాలని చూస్తే.. ఆ చేతులను నరికేస్తాం” అంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు.

గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదులు 25 మంది అమాయక పర్యాటకులను, ఒక స్థానికుడిని పొట్టనబెట్టుకున్న ఘోర దాడికి నిరసనగా భారత్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ తన భూభాగంలో ఉగ్రవాద మౌలిక సౌకర్యాలను పూర్తిగా నిర్మూలించే వరకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీనికి తోడు, రాబోయే ఏడాదిన్నర లేదా రెండేళ్లలో సింధు జలాల్లో భారత్‌కు చట్టబద్ధంగా ఉన్న పూర్తి వాటాను తామే వినియోగించుకుంటామని, ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్థాన్‌కు పోనివ్వబోమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి. ఆర్. పాటిల్ స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ మంత్రులు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ.. 1960లో ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయడం లేదా సవరించడం కుదరదని వాదించారు. పాకిస్థాన్‌లో 40 నుంచి 50 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున, ఈ నీరే తమ లైఫ్‌లైన్ మరియు రెడ్‌లైన్ అని పేర్కొన్నారు. ఈ అంశంపై తమకు అంతర్జాతీయంగా మద్దతు ఉందని చెప్తూ.. దీనిని అంతర్జాతీయ న్యాయస్థానం (International Court) వేదికగా ప్రస్తావిస్తామని పాక్ ప్రభుత్వం వెల్లడించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు