హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన ఒక విచిత్రమైన పేలుడు సంఘటన ప్రస్తుతం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఒక్కసారిగా భూకంపం వచ్చిందేమోనని తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి సదరు ఇంట్లోని గోడలు, కిటికీలు, తలుపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, కిచెన్లో గ్యాస్ సిలిండర్లు, స్టవ్, ఫ్రిడ్జ్, గీజర్ వంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు క్షేమంగానే ఉండటంతో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది పెద్ద మిస్టరీగా మారింది.
ఈ సంఘటన సరూర్నగర్ పరిధిలోని బాపూనగర్ రోడ్ నెంబర్ 4లో చోటు చేసుకుంది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి దేవేందర్ అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. ఆయన గత 24 ఏళ్లుగా తన భార్య, కుమారుడితో కలిసి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కిచెన్లో భారీ శబ్దంతో గోడలు బద్దలైనప్పటికీ, ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనా స్థలంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు కూడా లేవని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు, హైడ్రా (HYDRAA) సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెను ప్రమాదం త్రుటిలో తప్పిన ఈ మిస్టరీ పేలుడుకు గల అసలు కారణాలను అన్వేషించేందుకు అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.









