దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. ఫోన్ స్విచాఫ్? ఆందోళనలో దివ్వెల మాధురి!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఉదయం కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన ఆయన, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. గంటలు గడుస్తున్నా ఆయన పోలీస్ స్టేషన్‌కు చేరుకోకపోవడంతో పాటు, దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆయన డ్రైవర్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుండటంతో అనుచరుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు రహస్యంగా అదుపులోకి తీసుకుని ఉండవచ్చని దివ్వెల మాధురి ఆరోపిస్తున్నారు. ఆయన ఫోన్ నంబర్లు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను కొత్తూరు పోలీసులు పూర్తిగా తోసిపుచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ అసలు పోలీస్ స్టేషన్‌కే రాలేదని, ఆయన అదృశ్యం కావడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది.

మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగే అవకాశం ఉండటంతో, ముందు జాగ్రత్త చర్యగా దివ్వెల మాధురిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవలే కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన సమయంలో దువ్వాడ తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా రావడం, గేటు వద్ద పోలీసులతో తోపులాట జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజున టెక్కలి నుంచి కొత్తూరు వరకు పోలీసులు ముందస్తుగా నాకాబందీ నిర్వహించగా.. దువ్వాడ శ్రీనివాస్ హఠాత్తుగా కనిపించకుండా పోవడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు