అయోధ్య శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన హుండీ డబ్బుల చోరీ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ, రామాలయ ట్రస్ట్ వారి పరిధిలోనే నడుస్తున్నా ఈ దొంగతనం జరగడంపై ఆయన మండిపడ్డారు. ఈ చోరీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించకపోవడం దారుణమని, బీజేపీ ఇన్నేళ్లుగా రాముడి పేరును కేవలం రాజకీయాల కోసం, ఓటు బ్యాంక్ కోసమే వాడుకుందని ఆయన విమర్శించారు.
ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీల బృందాన్ని అయోధ్యకు పంపనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని పేర్కొంటూ.. ఆలయ భద్రతలో జరిగిన ఈ పెద్ద వైఫల్యానికి గాను ప్రధాని మోదీ దేశ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలను జగ్గారెడ్డి కొట్టిపారేశారు. కేటీఆర్ ప్రస్తుతం ఎలాంటి బాధ్యత లేక ఖాళీగా ఉండి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి ప్రజాసంక్షేమ హామీలను అమలు చేయడంలో బిజీగా ఉన్నారని, కేటీఆర్ ఎన్ని విమర్శలు చేసినా రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.









