‘తప్పంతా నాదే’.. హీరో అఖిల్ రాజ్ వివాదంలో డెలివరీ బాయ్ బహిరంగ క్షమాపణ!

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా హీరో అఖిల్ రాజ్ ఒక డెలివరీ బాయ్‌పై దాడి చేశారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సినిమా హీరో అనే అహంకారంతో ఒక సామాన్య డెలివరీ బాయ్‌పై చెయ్యి చేసుకున్నాడంటూ నెటిజన్లు అఖిల్ రాజ్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే, ఈ వివాదంలో తాజాగా ఒక ఊహించని బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఇష్యూలో తప్పంతా తనదేనంటూ సదరు డెలివరీ బాయ్ రమేష్ ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా హీరో అఖిల్ రాజ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగింపునకు వచ్చింది.

ఈ వివాదంపై మొదట హీరో అఖిల్ రాజ్ స్పందిస్తూ.. డెలివరీ బాయ్ రమేష్ పొరపాటున ఆర్డర్ మార్చి ఇవ్వడమే కాకుండా, తన తల్లిని దూషించాడని తెలిపారు. తాను అతడిపై ఎలాంటి భౌతిక దాడి చేయలేదని, కేవలం పద్ధతిగా మాట్లాడమని హెచ్చరించానని చెప్పారు. తాజాగా డెలివరీ బాయ్ రమేష్ కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తూ.. “నేను ఒక ఇంట్లో ఇవ్వాల్సిన డెలివరీని పొరపాటున ఇంకో ఇంట్లో ఇచ్చాను. నాదే తప్పు, నేనే తప్పుగా మాట్లాడాను. ఆ రోజు నా బర్త్‌డే ఉండటం, కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల డిప్రెషన్‌లో అలా ప్రవర్తించాను. ఆయన కొట్టడానికి వస్తున్నాడనే భయంతో ‘కొట్టు కొట్టు’ అంటూ వీడియో తీశాను, నా వల్ల ఆయన బ్లేమ్ అయ్యారు. అన్నా.. నన్ను క్షమించు” అని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

అఖిల్ రాజ్ ఒక సినిమా హీరో అని తనకు అస్సలు తెలియదని, సాధారణంగా ఫిల్మ్ స్టార్స్ మంచి విల్లాస్‌లో ఉంటారు కానీ ఇలాంటి నార్మల్ ఫ్లాట్స్‌లో ఉంటారని అనుకోలేదని రమేష్ పేర్కొన్నారు. అంతేకాకుండా, వాళ్లు బ్రాహ్మణులని తనకు ఆలస్యంగా తెలిసిందని.. సాధారణంగా శాకాహారుల ఇంట్లోకి పొరపాటున నాన్-వెజ్ ఆర్డర్ వెళ్తే ఎవరైనా అలానే కోప్పడటం సహజమేనని ఇప్పుడు రియలైజ్ అయ్యానని చెప్పారు. వీడియో వైరల్ అయిన వెంటనే డిలీట్ చేసి సారీ చెబుదామనుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రమేష్ వాపోయారు. డెలివరీ బాయ్ స్వయంగా లైవ్‌లోకి వచ్చి తప్పు ఒప్పుకోవడంతో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు