ఉచిత భోజనం కోసం భారీ క్యూ.. ఇది ‘మానసిక పేదరికం’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్..

ఉచితంగా వస్తే ఏదైనా వదులుకోకూడదనే మనస్తత్వం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఈ వైఖరిని “మానసిక పేదరికం”గా అభివర్ణిస్తూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. బెంగళూరులోని ఓ రెస్టారెంట్ మూడు రోజుల పాటు (జూన్ 29 నుంచి జూలై 1 వరకు) ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించడంతో, దాని ముందు జనం భారీగా క్యూ కట్టారు.

 

ఈ దృశ్యాన్ని @_parallelperspectives_ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వీడియో తీసి షేర్ చేశారు. ఆలయాల్లో దర్శనం కోసం క్యూ కట్టినట్లుగా ఉన్న ఈ జనాన్ని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర గంటల నుంచి మూడు గంటల పాటు ప్రజలు కేవలం ఉచిత ఆహారం కోసమే నిరీక్షించారని, వారిలో ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. “భారత్ ఒక విచిత్రమైన దేశం. ఇక్కడి ప్రజలు ఆర్థికంగా పేదలు కాదు, మానసికంగా పేదలు” అని తన పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు.

 

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఇది అత్యాశకు, పౌర స్పృహ లేకపోవడానికి నిదర్శనమని విమర్శించారు. చదువుకున్న వారు కూడా ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. మరికొందరు మాత్రం ఇందులో తప్పేమీ లేదని, పరిమిత కాల ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం సాధారణమేనని వాదించారు. ఇటలీ, వియత్నాం వంటి దేశాల్లో కూడా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమని కామెంట్లు చేశారు. ఈ రెస్టారెంట్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుందని, ఉచితం కాకపోయినా జనం వస్తారని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో భారత్‌లో “ఉచితాల సంస్కృతి”, ప్రజల మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు