భారత్, జపాన్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు నూతన శిఖరాలకు చేరుతున్నాయి. కేవలం అధికారిక చర్చలకే పరిమితం కాకుండా, ఇరు దేశాల అధినేతల మధ్య నెలకొన్న బలమైన వ్యక్తిగత అనుబంధానికి నిదర్శనంగా నిలిచి ఒక అరుదైన సన్నివేశం న్యూఢిల్లీలో ఆవిష్కృతమైంది. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకాయిచిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆత్మీయంగా తన ‘చెల్లెలు’ అని సంబోధించారు.
న్యూఢిల్లీ వేదికగా జరిగిన 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. హైదరాబాద్ హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో, దివంగత మాజీ ప్రధాని షింజో అబేను తాను సొంత అన్నయ్యలా భావించేదాన్నని తకాయిచి గుర్తుచేసుకున్నారు. అబేకు ప్రధాని మోదీ అత్యంత సన్నిహితులు కావడంతో, తనూ ఆయనను అదే దృష్టితో చూస్తున్నానని ఆమె పేర్కొన్నారు. దీనికి స్పందించిన మోదీ, ఆమెను ‘చిన్న చెల్లెలు’ అని సంబోధించారు. ఈ అనుబంధంతోనే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళతామని ఇరు నేతలు ఆకాంక్షించారు.
జపాన్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తకాయిచి భారత్‌లో జరిపిన తొలి అధికారిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య చరిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో సంయుక్త అభివృద్ధి కోసం తొలిసారిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆర్థిక, ఇంధన భద్రతపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించడంతో పాటు, రానున్న పదేళ్లలో జపాన్ నుంచి 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఈ సదస్సు ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక నూతన అధ్యాయానికి నాంది అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, ఇంధన రంగాల్లో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. స్వేచ్ఛాయుతమైన, నియమ నిబంధనలతో కూడిన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం కలిసి పనిచేయాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు.









