ముఖ్యమంత్రి ఆఫీసు ఉండే ఫ్లోర్ కు భోజనం కట్.. రెండేళ్లుగా బిల్లులు చెల్లించని ప్రభుత్వం..!

తెలంగాణ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఉండే ఫ్లోర్ కు క్యాటరింగ్ సేవలు నిలిచిపోయాయి. గత రెండేళ్లుగా కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన సరఫరాను నిలిపివేశారు. ఈ పరిణామంతో సచివాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉండే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కార్యాలయాల సిబ్బంది పాటు ఇతర ఉన్నతాధికారులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఫలహారాలు అందించే సేవలకు అంతరాయం ఏర్పడింది. పేరుకుపోయిన బకాయిలను కనీసం వాయిదాల పద్ధతిలోనైనా విడుదల చేయాలని కాంట్రాక్టర్ పలుమార్లు విన్నవించినప్పటికీ, అధికారులు స్పందించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

ఈ బకాయిలు కోట్ల రూపాయల్లో ఉండటంతో ముడిసరుకులు కొనుగోలు, సిబ్బంది జీతాల చెల్లింపు భారంగా మారి కాంట్రాక్టర్ చేతులెత్తేసినట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ విభాగాలకు చెందిన కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న ఆందోళనల నడుమ ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతల హామీతో కాంట్రాక్టర్లు తమ నిరసనలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఆహార సరఫరా నిలిచిపోవడం గమనార్హం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు