యూట్యూబర్ రావణ్‌కు మావోయిస్టులతో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచలన ఆరోపణలు..!

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బత్తుల జోసెఫ్) అరెస్టు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నాయని గన్నవరం పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆయనకు జులై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

 

పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రావణ్ ఫోన్‌లో మావోయిస్టు భావజాలానికి సంబంధించిన సమాచారం ఉందని, మావోయిస్టు అగ్రనేత హిడ్మాను పొగుడుతూ ఆయన ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు. యువతను, విద్యార్థులను మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

 

ఇటీవల ఏలూరులో జరిగిన ఓ దళిత క్రైస్తవ సభలో రావణ్ రెచ్చగొట్టేలా మాట్లాడారని, వ్యవస్థపై, పదవుల్లో ఉన్న వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని తెలిపారు. హిందూ దేవుళ్లను కించపర్చడమే అతడి లక్ష్యమని, రావణ్ అని పేరుపెట్టుకోవడం కూడా అందులో భాగమేనని రిపోర్టులో వివరించారు.

 

గన్నవరం జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 152 (గతంలో దేశద్రోహం)తో పాటు ఉపా చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. శనివారం రాత్రి రావణ్‌ను అరెస్ట్ చేసి, ఆదివారం కోర్టులో హాజరుపరిచారు.

 

ప్రస్తుతం నిందితుడు దర్యాప్తునకు సహకరించడం లేదని, అతనికి సహకరిస్తున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు రావణ్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు