భద్రాచలం ఏరియా ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టండి ​- ఎంపీ బలరాం నాయక్‌ , ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కు మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ వినతి

భద్రాచలం ఏరియా ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టండి

​- ఎంపీ బలరాం నాయక్‌ , ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కు మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ వినతి

– అదనపు వైద్యులు, సిబ్బందిని నియమించాలి

– సిటీ స్కాన్, ప్లేట్‌లెట్ వేరు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

– తల సేమియా , సికిల్ సెల్ చిన్నారులకు ప్రతినెల 10 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి

​భద్రాచలం టౌన్ , జూలై 6
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న వైద్యుల కొరతను తీర్చాలని, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ కోరింది. ఆదివారం భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులను కలిసి ట్రస్ట్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొప్పుల మురళి మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భద్రాచలం ఆస్పత్రికి గిరిజనులు, పేద ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, అయితే సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు అత్యవసరమైన ‘ప్లేట్‌లెట్ సెపరేటర్’ లేకపోవడం, ప్రమాదాల సమయంలో ‘సిటీ స్కాన్’ కోసం బయట ఆస్పత్రులకు వెళ్లాల్సి రావడం వల్ల పేదలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న పిల్లలకు నెలకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

— ​సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ బలరాం నాయక్

సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్వీకరించిన ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఆస్పత్రిలో వైద్యుల , నర్సింగ్ సిబ్బంది కొరతను , అలాగే మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సిటీ స్కాన్, ప్లేట్‌లెట్ సెపరేటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని, తలసేమియా పిల్లల ఆర్థిక సాయం అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జిలకర నాగరాజు, పీర్ల నాగేంద్ర, గాడి విజయ్, మహమ్మద్ జిందా తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు