తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేపుతూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు భారీ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ, నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. నారాయణఖేడ్‌లోని బసవేశ్వర విగ్రహం నుంచి సంగమేశ్వర ప్రాజెక్టు వరకు ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని హరీశ్ రావు ఆరోపించారు. దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఆశలను నీరుగార్చిందని మండిపడ్డారు. అలాగే సింగూరు ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా ఖాళీ చేయడం వల్ల జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు.
సాగునీరు లేక క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందించలేదని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాల అమలులోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. రైతుల పొలాలకు నీళ్లు ఇచ్చేంతవరకు విశ్రమించేది లేదని, నిలిచిపోయిన ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, రూట్ మ్యాప్ వివరాలను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాయి.









