నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం: ప్రధాని బాలెన్ షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆగ్రహం

గతేడాది జెన్-జీ యువత చేపట్టిన భారీ ఉద్యమంతో నేపాల్‌లో ప్రభుత్వం కూలిపోయి, కేపీ శర్మ ఓలీ స్థానంలో బలేంద్ర (బాలెన్) షా నాలుగు నెలల కిందట ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంతలోనే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్ యువత మళ్లీ వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసనలు తెలుపుతోంది. గత వారం కాఠ్మాండ్‌లో పోలీసులు ఒక రైడ్-షేరింగ్ డ్రైవర్ బైక్ చక్రానికి తాళం వేయడంతో, తీవ్ర ఆవేదనకు గురైన సదరు డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడమే ఈ తాజా ఉద్రిక్తతలకు కారణమైంది.

ది కాఠ్మాండ్ పోస్ట్ నివేదిక ప్రకారం, 25 ఏళ్ల రైడ్-షేరింగ్ డ్రైవర్ గణేష్ నేపాలీ తన క్లయింట్ కోసం వీధిలో వేచిచూస్తుండగా పోలీసులు అతడి బైక్ వీల్‌ను లాక్ చేశారు. దీనితో మనస్తాపం చెందిన గణేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషాద ఘటనతో భగ్గుమన్న వందలాది మంది యువతీ యువకులు ఆదివారం రాజధానిలోని సింగ్‌దర్బార్ సెక్రటేరియట్ వెలుపల పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పేదలపై అఘాయిత్యాలను అంతం చేయాలని, అక్రమ అరెస్టులను ఆపాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు.

బాలెన్ షా 2022లో కాఠ్మండ్ మేయర్‌గా ఎన్నికైనప్పటి నుంచి నగర నిర్వహణ, ఫుట్‌పాత్‌లు మరియు అనధికార వీధి మార్కెట్ల తొలగింపు విషయంలో పోలీసులు అత్యంత దూకుడుగా, కఠినంగా వ్యవహరిస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. నదీతీర మురికివాడల తొలగింపు వంటి చర్యలు పేదల పట్ల కనీస మానవత్వం లేకుండా సాగుతున్నాయనే అసంతృప్తి ప్రజల్లో నెలకొంది. నగరంలో పరిపాలనా విధులు బలప్రయోగం ద్వారా కాకుండా సమాజ భాగస్వామ్యంతో సాగాలని, స్థానిక యంత్రాంగం తమ రాజ్యాంగ పరిధిని దాటి ప్రవర్తిస్తోందని చట్టపరమైన నిపుణులు విమర్శిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు