మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’ టీజర్ సోమవారం సోషల్ మీడియా వేదికగా విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్, హారర్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. దర్శకుడు మేర్లపాక గాంధీ మార్క్ కామెడీతో, వరుణ్ తేజ్ సరికొత్త మాస్ అవతార్‌తో నిండిన ఈ టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ చిత్ర కథ రాయలసీమలోని పెనుకొండ అనే గ్రామం నేపథ్యంలో సాగుతుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. చిన్న చిన్న కారణాలకే మద్యం సేవిస్తూ ముక్కోపిగా తిరిగే కనకరాజు అనే రాయలసీమ యువకుడి జీవితంలోకి డ్రాగన్ బొమ్మ ఉన్న ఒక విచిత్రమైన కుండీ వచ్చిన తర్వాత కథ మలుపు తిరుగుతుంది. దాన్ని తాకడంతో కనకరాజుకు అతీత శక్తులు రావడం, ‘కొరియా’ అనే పదం వినపడగానే అతని కళ్ళు నీలంగా మారి ప్రవర్తన పూర్తిగా మారిపోవడం వంటి సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాయలసీమ నేపథ్యానికి, కొరియా సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటనేది క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్ రితికా నాయక్ కొరియన్ భాషలో మాట్లాడటం, కమెడియన్ సత్య కామెడీ హైలైట్‌గా నిలిచాయి. టీజర్ చివర్లో వరుణ్ తేజ్ ఒంటి నిండా టాటూలతో కొరియన్ మాఫియా డాన్‌లా కనిపించి ట్విస్ట్ ఇచ్చారు. టీజర్ చాలా బాగుందని, వరుణ్ తేజ్ కొత్త అవతార్ అద్భుతంగా ఉందంటూ ప్రభాస్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, సినిమాను ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు.









