మాజీ జవాన్‌కు రూ.1.25 కోట్ల పరిహారం: సీఆర్పీఎఫ్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విధి నిర్వహణలో ఉండగా కంటిచూపు కోల్పోయిన ఒక కానిస్టేబుల్‌ను సర్వీస్ నుంచి తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన న్యాయస్థానం, బాధిత మాజీ జవాన్‌కు ఏకమొత్తంగా రూ.1.25 కోట్లు పరిహారంగా చెల్లించాలని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, సీఆర్పీఎఫ్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ తీర్పును వెలువరించింది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (డ్రైవర్)గా పనిచేస్తున్న బలి రామ్, 1996లో విధి నిర్వహణలో ఉండగా కంటిచూపు సమస్యకు గురికావడంతో, 1998లో ఆయన్ను వైద్యపరంగా అనర్హుడిగా ప్రకటిస్తూ సర్వీస్ నుంచి తొలగించారు. అయితే, వికలాంగుల చట్టం ప్రకారం బాధితుడికి ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించడం అధికారుల బాధ్యత అని, అంతేకానీ అది వారి విచక్షణాధికారం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. బాధితుడి కోసం ఒక కుర్చీని అధికారులే వెతకాలి తప్ప, అతడు వచ్చి ప్రాధేయపడేవరకు ఆగకూడదంటూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

బాధిత జవాన్ బలి రామ్ ఇప్పటికే మూడు దశాబ్దాలుగా సర్వీస్‌కు దూరంగా ఉండి, పదవీ విరమణ వయసు కూడా దాటిపోవడంతో ప్రస్తుతం ఆయన్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు పేర్కొంది. అందువల్ల, ఆయనకు రావాల్సిన బకాయిపడ్డ జీతభత్యాలు, వడ్డీ, కేసు ఖర్చులతో కలిపి ఎనిమిది వారాల్లోగా రూ.1.25 కోట్లు చెల్లించాలని సీఆర్పీఎఫ్‌ను ఆదేశించింది. అలాగే, ఈ పరిహారాన్ని బాధితుడు సక్రమంగా పెట్టుబడి పెట్టుకునేందుకు మరియు అతని వైద్య అవసరాలను పర్యవేక్షించేందుకు స్థానిక న్యాయ సేవాధికార సంస్థ సహాయం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు