తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల సాధనే ఏకైక పరమావధిగా కేంద్ర ప్రభుత్వం వద్ద మన గళాన్ని బలంగా వినిపించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు. జులై 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం (జులై 14) హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర ఎంపీలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీకి అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు కూడా హాజరుకాగా, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై అధికారుల చేత పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు. అభివృద్ధి విషయంలో భేషజాలు పక్కనబెట్టి రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ వృద్ధిని మార్చే కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీలు ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ఐఐఎం (IIM) ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవాలని, అలాగే మెట్రో ఫేజ్-1 స్వాధీనం, రెండో దశ విస్తరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం అనుమతులు, మూసీ పునరుజ్జీవనం పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద చేర్చడం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై బుల్లెట్ రైళ్ల అలైన్మెంట్లు, ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్ట్‌లలో ఎయిర్ కార్గో, ఎంఆర్ఓ (MRO) కేంద్రాల సాధనపై ఢిల్లీ వేదికగా ఒత్తిడి తేవాలని స్పష్టం చేశారు.
నదీ జలాల విషయానికి వస్తే.. తుంగభద్ర పూడికతీతపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని, గోదావరి-కావేరి అనుసంధానంలో ఛత్తీస్‌గఢ్ వాడుకోని మిగులు జలాల నుంచి తెలంగాణకు దక్కాల్సిన 43 టీఎంసీలను సాధించుకోవాలని సీఎం సూచించారు. కాగా, ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని వేగంగా అందించడానికి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌ను నియమించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే, అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసే బాధ్యతను నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి అప్పగించారు. సింగరేణి ప్రయోజనాల కోసం గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను వేలం లేకుండా నేరుగా కేటాయించేలా చూడాలని, గతంలో ప్రైవేట్‌కు ఇచ్చిన సత్తుపల్లి, కోయగూడెం-3 బ్లాకులను తిరిగి సింగరేణికే దక్కేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భట్టి విక్రమార్క కోరారు.









